వకీల్ సాబ్ రివ్యూ

0
758
Vakeel Saab Review

‘అజ్ఞాతవాసి’తో చేదు అనుభవాలు మిగిల్చి సినిమాల నుంచి నిష్క్రమించి పూర్తి స్థాయిలో రాజకీయల్లో గడపాలనుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు మళ్ళీ 3 ఏళ్లకు పైగా విరామం తర్వాత పునరాగమనం చేస్తూ నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం హిందీ లో 2016 లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన “పింక్”, ఇది ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఆ తర్వాత 2019 లో తమిళ్ లో అజిత్ ఈ సినిమాని “నేర్కొండ పార్వాయ్‌” అనే పేరుతో రీమేక్ చేయగా హిట్టుగా నిలిచింది. పవన్ కళ్యాణ్ నటించిన చివర 4 సినిమాల్లో వకీల్ సాబ్ రెండవ రీమేక్, ఆశ్చర్యం ఏంటంటే ఆ రెండు కూడా అజిత్ సినిమాల రీమేక్స్ అవ్వడం. “కాటమరాయుడు” బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది, మరి వకీల్ సాబ్ ఎలా ఉందో చూసేద్దాం..!!

కథ :

ముగ్గురు మిడిల్ క్లాస్ ఇండిపెండెంట్ అమ్మాయిలు అయిన పల్లవి (నివేత థామస్), జెరీనా (అంజలి), దివ్య (అనన్య నాగళ్ళ) తమ కష్టార్జీతంతో వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటూ కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఒక రోజు ఈ ముగ్గురికి అనుకోని పరిస్థితి ఎదురు అవుతుంది, ఆ సమయం లో పల్లవి పై అత్యాచారయత్నం జరుగుతుంది. ఆ క్షణం లో తనని తాను రక్షించుకోవటానికి తనపై అత్యాచారం చేయబోయిన అబ్బాయి తల పై బలంగా కొట్టి గాయపరుస్తుంది. ఆ సంఘటన తరువాత ఈ అమ్మాయిలను బెదిరించడం స్టార్ట్ చేస్తారు ఆ అబ్బాయిలు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటారు. ఇక్కడే క్రిమినల్ లాయర్ అయినా సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) ఎంట్రీ జరుగుతుంది. గతం లో న్యాయ పోరాటాల్లో ముందు నిలిచి పోరాడిన లాయర్ గా పేరు పొందిన సత్యదేవ్, పల్లవి కేసుని టేక్ అప్ చేస్తాడు. అబ్బాయిల తరపున లాయర్ నందగోపాల్ (ప్రకాష్ రాజ్) వాదిస్తారు. ఇక ఈ కేసు లో ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనేదే కథ.

విశ్లేషణ :

“పింక్” సినిమా చాలా సీరియస్ గా కేవలం కోర్ట్ రూం డ్రామాగా సాగే సినిమా. అదిమాత్రమే కాదు అమితాబ్ ది వృద్ధ‌ వకీలు పాత్ర కూడానూ, ఎక్కడా సగటు హీరోయిజం కనిపించని క్యారెక్టర్ అది. అలాంటి చిత్రాన్ని మాస్ హీరో పవన్ కళ్యాణ్ తో చేస్తున్నారన్న ప్రకటన కొంత ఆశ్చర్యానికి కలిగించింది. కానీ తమిళ్ లో క్రేజ్ ఉన్న మాస్ హీరో అజిత్ ఈ సినిమా రీమేక్ “నేర్కొండ పార్వాయ్‌” చెయ్యడం, అది ఫర్వాలేదు అనుపించుకోవడం కొంత ఊరటనిచ్చింది. ఇక “వకీల్ సాబ్” విషయానికి వస్తే పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లను పవన్ కల్యాణ్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని తగినన్ని మార్పులు, చేర్పూలు చేసారు అనేలా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే “పింక్” కి “నేర్కొండ పార్వాయ్‌” చిన్న చిన్న మార్పులు, చేర్పులతో ఎక్కడ పింక్ సోల్, న్యాచ్యురల్ సెటప్, ఓరిజినాలిటిని చెడగొట్టకుండా అజిత్ ఇమేజ్ కి తగ్గట్లుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యరనే చెప్పాలి. అయితే తెలుగులో మాత్రం అవన్ని మిస్ అయ్యాయనే చెప్పొచ్చు.


ఈ సినిమాకి కోర్ట్ రూంలో జరిగే డ్రామానే ప్రధాన ఆకర్షణ. కథనం ముందే ఊహించదగ్గట్లుగా రొటీన్ మాస్ సినిమాగా ఉన్నప్పటికీ, గంటకు పైగా కథ కోర్ట్ రూంలోనే గడిచినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్ మధ్య హోరాహోరీ వాదనలతో నడిచే కొన్ని సన్నివేశాలు అభిమానులతోనే కాదు మామూలు ప్రేక్షకులతోనూ చప్పట్లు కొట్టిస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దిన కొన్ని సన్నివేశాలు అతిగా అనిపించినప్పటికీ.. ఫైట్లు, క్లైమాక్స్ లతో ఓవరాల్ గా కవర్ చేసారనిపిస్తుంది. ఈ స్టోరీని పవన్ తన ఇమేజ్ పెంచుకోవడానికి కూడా బాగానే ఉపయోగించుకున్నాడు. సమయోచితంగా తన రాజకీయ భావజాలాన్ని జనసేనాని గట్టిగా వినిపించే ప్రయత్నం చేయడం ఇందులో కొసమెరుపు. ఇక పెర్ఫామెన్స్ గురించి చెప్పాలంటే మొదటిగా అంజలి,నివేత థామస్ గురించే చెప్పాలి, చాలా నేచురల్ గా నటించారు. ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఈ కథలో పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెద్దగా సింక్ కాలేదు, బలవంతంగా అతికించినట్లుగా అనిపిస్తుంది. శ్రుతి హాసన్ అప్పీయరెన్స్ పేలవంగా ఉండటం వల్ల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషన్ కూడా పండలేదు. దర్శకుడు వేణు శ్రీరాం కొన్ని సన్నివేశాలు అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం ఫలించినప్పటికీ.. సగటు ప్రేక్షకుడిని, ఒరిజినల్స్ ని చూసిన వారికి కొంత నిరాశపరిచారనే చెప్పొచ్చు. ఇక థమన్ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫి ఫర్వాలేదు అనేంతలా అనిపిస్తాయి.

పాజిటివ్ పాయింట్స్ :

  • అంజలి – నివేథా థామస్ నటన
  • ప్రీ ఇంటర్వెల్ ఫైట్ మరియు మెట్రో ట్రైన్ ఫైట్ సీక్వెన్స్
  • క్లైమాక్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగటివ్ పాయింట్స్ :

  • ఊహించదగిన విధంగా సాగే కథనం
  • బొరింగ్ ఫ్లాష్ బ్యాక్
  • సోల్, న్యాచురల్ సెటప్, ఒరిజినాలిటీ ని రీమేక్ మిస్ అవ్వడం
  • కొన్ని పొలిటికల్ ప్రొపగాండాతో కూడిన డైలాగులు
  • కొన్ని సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ గెటప్

పంచ్ లైన్ :

రీమేక్ కి న్యాయం చేయలేకపోయిన వకీల్ సాబ్

రేటింగ్ : 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here